ఆకెళ్ళ ఫౌండేషన్ – వేద పరిరక్షణ విభాగం

ఆకెళ్ళ ఫౌండేషన్ – వేద పరిరక్షణ విభాగం

‘‘వేదయతీతి వేద:’’ అంటే అన్నింటిని తెలియజేసేది గనుక వేదం అని చెప్పబడినది. వేదము ‘‘విద్‌’’ అనేధాతువునుండి పుట్టింది. విద్‌ అనే ధాతువుకు ‘తెలియజేయునది’, ‘విచారణ’, ‘శక్తి’, ‘జ్ణానము’ అనే అర్థాలు ఉన్నాయి.
ప్రత్యక్షేణానుమిత్యావా యస్తుపాయో నవిద్యతే।
ఏతం విదంతి వేదేన తస్మాద్వేదస్య వేదతా॥

ప్రత్యక్ష, అనుమాన ప్రమాణముల‌చేతగాని, ఇంకా ఏ ఇతర ఉపాయముల‌చేతగాని తెల‌సుకునుటకు వీలులేని విషయముల‌ను తెలియజేయునది వేదం. అందుకే వేదానికి దైవత్వం సిద్ధించింది. ‘‘విదన్తియతో ధర్మాధర్మానితి వేద:’’ దేని వల‌న ధర్మము, అధర్మముల యొక్క వివేకము తెలుస్తుందో అది వేదము. వేదానికి ఆమ్నాయమని, శృతి అని కూడా పేర్లు. వేదమును సృష్టి ప్రారంభమునుండి ఒకరినుండి మరొకరు వినడం వల‌ననే ఇది వ్యాప్తి చెందింది గనుక దీనికే ‘శృతి’ అని పేరు. ఆమ్నాయమంటే వల్లించటం. వల్లించడం వల‌న‌ ఇది స్వాధీనమవుతుంది కాబట్టి ఇది ‘ఆమ్నాయం’ అనికూడా పిలువబడుతుంది.

వేదములు నాలుగు. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మరియు అధర్వణవేదము.

ఋగ్వేదము
ఋగ్వేదంలో సామాజిక ప్రవర్తన గురించి చక్కగా వర్ణించబడింది. ఋగ్వేదము కామితార్థాలను తీర్చే వేదం. వర్షాలుపడాలంటే పర్జన్య సూక్తాలు పఠించాలని సూచింప బడింది. జూదం ఆడకూడదని అనేక సూక్తాలు బోధించాయి. “ఆ నో భద్రాః క్రతవో యంతు విశ్వత॰” అనే సూక్త పఠనం మానవులను దీర్ఘాయుష్కులను చేస్తుందని వచనం.

యజుర్వేదం
యజుర్వేదం అంటే యాగాలు ఎలాచేయాలో చెప్పేది. యాగము, దానము మొదలైనవాటిని ఆచరించేటపుడు ఋత్విక్కులు చెప్పే మంత్రాలు యజుర్వేదంలో ఉన్నాయి. ప్రజాపతి, పరమేష్ఠి, నారాయణుడు, బృహస్పతి, ఇంద్రుడు, వరుణుడు, అశ్విని మొదలైన దేవతల స్తుతులున్నాయి. ఈ స్తోత్రములకు కర్తలు వసిష్ఠుడు, వామదేవుడు, విశ్వామిత్రుడు.

సామవేదము
సామం అనగా మధురమైనది. అంటే ఇది యాగాలలో దేవతల గొప్పతనాన్ని మధురంగా కీర్తించేది. నాలుగు వేదాల క్రమంలో మూడవది. దీనిని వేదవ్యాసుడు జైమినిమహర్షికి బోధించాడు. ఇందులో ముఖ్యాంశం యజ్ఞాలలో ఉద్గాత గానం చేసే స్తోత్రాలు. గానం చేసేటప్పుడు ఉచ్ఛారణాపరంగా ప్రత్యేకమైన విధానంలో గానం చేయాలి.

అధర్వణ వేదం
సనాతన ధర్మంలో పవిత్ర గ్రంథాలైన చతుర్వేదాలలో నాలుగవది. అధర్వణ ఋషి పేరు మీదుగా దీనికాపేరు వచ్చింది. సాంప్రదాయం ప్రకారం ఇది రెండు వర్గాల ఋషులచే సంకలనం చేయబడింది. ఒకటి అధర్వణులు, రెండు అంగీరసులు. అందుకనే దీని ప్రాచీన నామం అధర్వాంగీరస వేదం. ఋగ్వేదంలానే ఇది కూడా స్తోత్రాల చే కూర్చబడింది కానీ ఇందులో కొన్ని మంత్ర విద్యకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. అధర్వణ వేదాన్ని చాలామంది గుప్త విజ్ఞానంగా భావిస్తారు. ఇందులో వేదకాలంలో సామాన్య మానవులు ఎలా ఉండేవారన్న విషయాలు కూడా ఉటంకించబడ్డాయి.

ప్రతిసృష్టి ప్రారంభంలో ఋషులు త‌మ త‌ప‌శ్శ‌క్తితో వేద‌మంత్ర‌ముల‌ను ద‌ర్శించి, తమశిష్యులకు వాటిని ఉపదేశిస్తారు. పిదప వారు వారి శిష్యుల‌కు బోధిస్తారు. ఇలా వేదం గురుశిష్య పరంపరతోనే లోకంలో ప్రచరితమవుతుంది. అందువ‌ల్ల‌ వేదము గురువునుండి ఉపదేశ రూపములోనే పొందాలి. స్వతంత్య్రంగా, వ్రాతపూర్వకంగా వల్లించుటకు వీలులేదు. దీనికి ప్రమాణంగా హారీతస్మృతిలో ‘‘గురుముఖాదేవధ్యేతవ్యం నతులిఖిత పాఠ:కర్తవ్య:’’ అనే వాక్యం ఉన్నది. చదవడంలో ఏమాత్రం స్వర, అక్షర, వర్ణాది దోషాలు సంభవించినా దాని అర్థము మారిపోయి ప్రతికూల‌ ఫలితాన్నిచ్చే ప్రమాదం కూడా ఉన్నది. అందుకనే అధ్యయన మరియు అధ్యాపనము ద్వారానే వేదాన్ని, గురుశిష్య పరంపరను కాపాడవల‌సి ఉన్నది.

అటువంటి గురుపరంపరను నేటికి కాపాడుతూ, వేదవిద్య రక్షణలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వెరువక, వేదవిద్యాభివృద్ధి, తద్వారా లోకరక్షణే ధ్యేయంగా కృషిచేస్తూ ఎంతోమంది వేదపండితుల‌ను లోకానికి అందించి మహోపకారం చేస్తున్నాయి వేదవిద్యా గురుకులాలు. ఈ వేదపాఠశాల‌లో ఎంతోమంది విద్యార్థులుగా చేరి వేదవిద్యను అభ్యసించి పండితులుగా మారి, దేశవ్యాప్తంగానే గాక విదేశాల‌లోను వైదిక కార్యక్రమాల‌ను నిర్వహిస్తు ‘‘కృణ్వంతో విశ్వమార్యమ్‌’’ అన్న వేదోక్తిని అచరణలో పెడుతున్నారు. ఇది నిజంగా అభినందనీయం.

నేటిసమాజంలో నెల‌కొన్న పరిస్థితుల‌దృష్ట్యా వేదపాఠశాల నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అటువంటి ఆటంకాలు ఎన్ని ఎదురైనా నిస్వార్థంతో వేదమాత సేవలో కొనసాగుతున్న వేదపాఠశాల‌ను ఆద‌రించ‌వ‌ల‌సిన బాధ్య‌త ప్ర‌తి భార‌తీయుడిదీ. అలా అంద‌రూ సంక‌ల్పించిననాడు వేద‌పాఠ‌శాల‌లు మనమిచ్చే ప్రోత్సాహంతో మ‌రింత మందికి వేదవిద్యను అందించి వేదవ్యాప్తి, తద్వారా సమాజ శ్రేయస్సుకు పాటుప‌డ‌గ‌ల‌వ‌న‌డంలో సందేహం లేదు అన్న భావనతో ఆకెళ్ళ ఫౌండేషన్ ద్వారా “వేద పరిరక్షణ విభాగం” ప్రారంభించబోతున్నాము. ఈ విభాగం ద్వారా ఇబ్బందులలో ఉన్న వేద పాఠశాలలకు ఆకెళ్ళ పరివారం తనవంతు సహాయం అందజేస్తుంది.

ఆకెళ్ళ ఫౌండేషన్ ద్వారా శ్రీ దువ్వూరి లక్ష్మీ నారాయణ సోమయాజులు గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న ముక్కామల లోని “శ్రీ కోనసీమ యజుర్వేద పాఠశాల” కు మనవంతు బాధ్యతగా ఇదివరలో పది వేల రూపాయల నగదు సహాయం చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఉన్న ఈ ‘లాక్ డౌన్’ సమయంలో ఇబ్బందుల్లో ఉన్న హైదరాబాద్ కమలానగర్ లోని “మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యా పీఠము” వారికి నిత్యావసర సరుకులు అందచేయడం జరిగింది.

మన దృష్టిలోకి వచ్చిన రెండు తెలుగు రాష్ట్రాలలోని వేదపాఠశాలలను సందర్శించి, వాటి పరిస్థితులను విచారించి, వేద విద్యార్థుల అవసరాలను పరిశీలించి, వారికి వీలైనంత సహాయం అందచేయడమే ముఖ్యోద్దేశ్యము గా మన ఆకెళ్ళ ఫౌండేషన్ వారి ఈ వేద పరిరక్షణ విభాగం పనిచేస్తుంది.

ఈ సత్క్యారంలో ఆశక్తి ఉన్నవారు తమకు వీలయిన విధంగా పాల్గొనవచ్చు.

Scroll to Top